సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా
'పుష్ప-2' మూవీ ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ ఏ11 నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
కాగా, తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఆయన తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు ఈ నెల 13న విధించిన 14 రోజుల రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో బన్నీ శుక్రవారం వర్చువల్‌గా న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు.
మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్టు ప్రకటించింది. అదే రోజు బన్నీ రిమాండ్‌పైనా కూడా విచారణ జరుగనుంది.