ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (13:22 IST)

విజయదశమి... ఈ రోజున ప్రారంభించిన పనులు తప్పకుండా జయమే

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమికల మాసం ఆశ్వీయుజమాసం. శరద్రుతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి.
 
తొమ్మిదిరోజులు దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీనవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరద్రుతువులో జరుపుకుంటారు గనుక శరన్నవ రాత్రులని కూడా అంటారు. ఈ పండుగలలో రామభక్తిభావం ఉత్తుంగతరంగంగా దేశాన్నంతటిని ముంచెత్తుతుంది. ఉత్తరభారతంలో పల్లెలు, పట్టణాలలో "రామలీల" ఉత్సవాలు నెలరోజులు ముందుగానే ప్రారంభం అవుతాయి.
 
చివరిరోజైన దశమి (విజయదశమి) నాడు "రావణవధ" మహాకోలాహలంగా జరుగుతుంది. అంటే చెడును జయించి మంచికి పట్టంకట్టటమన్నమాట. ఆ విధంగా విజయాన్ని చేకూరుస్తుంది కనుక దీనిని విజయదశమిగా వ్యవహరిస్తారు.
 
అదీకాక జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. కొన్ని ప్రాంతాలలో విజయదశమి "అపరాజితాదశమి" అనికూడా వ్యవహరిస్తారు. కారణం ఈ రోజున ప్రారంభించిన పనులు ఎప్పడూ విజయవంతం కావటమే. లౌకికమైన పూజలతో ఈ విజయదశమికి శాస్త్రీయవిధి కూడా వుంది. ఈ రోజున శమీవృక్ష పూజచేస్తాం.
 
అజ్ఞాతవాసారంభంలో అర్జునుని గాండీవంతో పాటు పాండవుల ఆయుధాలన్నీ ఈ శమీవృక్షంలోనే దాచుటమే! అందుకు కారణం. రామచంద్రుడు కూడా తాను విజయ యాత్రకు బయలుదేరేముందు జమ్మిపుజ చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి.