మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 జూన్ 2015 (18:24 IST)

ఘనంగా కొలంబస్‌లో ధీంతానా పోటీలు...

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (టాకో) సంయుక్తంగా నిర్వహించిన ధీంతానా ప్రతిభా ప్రదర్శన పోటీలు మే 31వ తేదిన కొలంబస్‌లో ఉన్న హేస్టింగ్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో దిగ్విజయంగా జరిగాయి. సుమారు నూట ఇరవై మందికిపైగా పెద్దలూ, పిన్నలూ శాస్త్రీయ మరియూ సినిమా సంగీత, నృత్య విభాగాలలోనూ, అలాగే మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా విభాగాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 
 
అత్యంత నిపుణుతతో అలంకరించిన వేదిక, క్యాట్ వాక్ కోసం చేసిన ర్యాంప్ అందరినీ విశేషంగా ఆకర్షించాయి. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు రవి సామినేని స్వాగత వాక్యాలతో కార్యక్రమానికి నాంది పలికారు. ఆ తరువాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, ధీంతానా కార్యదర్శులు మనోరమ గొంధి, జోగేశ్వర రావు పెద్దబోయిన, శ్రీదేవి మానేపల్లి, భారతి ఐత్య, తానా మీడియా భాగస్వామి సునీల్ పాంత్రా తదితరులు జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రామచంద్రరావు రేవూరు, మహీధర్ వన్నె, దిషా పెనుమంచి, సరితా రావిపాటి, గీతా నోరి, జ్యోతి దండు, వీణా కామిశెట్టి, సిద్ధార్థ్ రేవూరు వ్యవహరించారు.
 
''శిశుర్వేక్తి, పశుర్వేక్తి, వేక్తి గానరసం ఫణి'' అన్నట్లుగా శాస్త్రీయ సంగీతంతో పోటీలు ప్రారంభమై, ఆ తరువాత చలన చిత్రానికి సంబంధించిన పాటలతో చిన్నారులందరూ ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేశారు. శాస్త్రీయ సంగీతానికి న్యాయనిర్ణేతలుగా రాజేశ్వరి గోపాల్, సీతాలక్ష్మి, శ్రీరామ్ శఠగోపన్ వ్యవహరించారు. అలాగే సినిమా మరియూ జానపద నృత్య విభాగానికి న్యాయ నిర్ణేతలుగా సుధా ఆకెళ్ళ, రామ్ దుర్వాసుల, లలిత గొడవర్తి వ్యవహరించారు.
 
ఆ తరువాత ''ఆంగికం భువనం యస్య'' అని చెప్పినట్లు శాస్త్రీయ, సినిమా పాటలకు వైవిద్యభరితమైన నృత్యాలను చిన్నారులు ప్రదర్శించి అందరినీ సమ్మోహితులని చేసి వారి ప్రశంసలను, మన్ననలను అందుకొన్నారు. న్యాయ నిర్ణేతలుగా మాధవి సుధీర్, వర్ధిని పత్తిపాటి, జయంతి సేన్ వ్యవహరించారు. సంగీత, నృత్య విభాగాలలో ప్రధమ, ద్వితీయ విజేతలకు పతకాలు, బహుమతులను ధీంతానా కార్యవర్గం అందజేశారు.
 
టాకో కార్యవర్గ అధ్యక్షులు రవి సామినేని కొలంబస్ ధీంతానా కార్యవర్గం తరఫున తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని, తదితర తానా సభ్యులనందరినీ సత్కరించారు. ఆ తరువాత ప్రసంగించిన మోహన్ నన్నపనేని కొలంబస్ ధీంతానా కార్యవర్గాన్ని అలాగే పోటీలలో పాల్గొన్న వారలనందరినీ అభినందించి, కొలంబస్ తెలుగువారిని సాదరంగా డెట్రాయిట్ మహానగరంలో జూలై నెలలో జరగనున్న తానా సభలకి ఆహ్వానించారు. 
 
మోహన్ నన్నపనేని, తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు రవి సామినేని, కొలంబస్ ధీంతానా కార్యవర్గ సభ్యులైన గణేష్ వఠ్యం, శ్రీనివాస్ ఎలవర్తి, గీతా నోరి, జ్యోతి దండు, వీణా కామిశెట్టిని అభినందించి సత్కరించారు. రవి సామినేని కొలంబస్ ధీంతానా Grand Sponsors Garudavega Courier Service, United Software Group, Siri Info Solutions Inc, జగదీష్ ప్రబలకు అలాగే సుమారు పది గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని విసుగు విరామం లేకుండా చెరగని చిరునవ్వుతో తన కెమెరాతో కవర్ చేసిన టీవీ 9 కెమెరామెన్ భాస్కర్కు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.
 
కొలంబస్ మహానగరంలో తొలిసారిగా జరిగిన టీన్, మిస్, మిసెస్ తానా పోటీలలో అదిరేటి డ్రెస్స్ మేమేస్తే, బెదిరేటి లుక్స్ మేమిస్తే అని అన్నట్లు తెలుగు టీనేజ్ పిల్లలు, అవివాహితులైన యువతులు, గృహిణులు పాల్గొని కార్యక్రమానికి ఒక వెలుగుని కళని తీసుకుని వచ్చారు. భళా అన్నరీతిలో జరిగిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా గీత విద్దం, స్మిత రెడ్డి, రాధిక గడ్డం వ్యవహరించారు. ధీంతానా కార్యవర్గం విజేతలకు కిరీటం, పతకం తొడగటంతో పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆఖరుగా భారత జాతీయ గీతం ఆలాపనతో ఈ కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.