1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 మే 2025 (10:50 IST)

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani
Shani
మే 10 శనివారం శనిత్రయోదశి సందర్భంగా శని వక్రదృష్టిని పోగొట్టుకునేందుకు విశేష పూజలను ఆలయాల్లో నిర్వహిస్తారు. శనివారానికి త్రయోదశి తిథి కలయిక వల్ల ఈ విశేష పర్వదినం వస్తోంది. శనైశ్చరుడు సూర్యభగవానుడు, ఛాయాదేవీల కుమారుడు. విశ్వకర్మ తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యభగవానుడికిచ్చి వివాహం జరిపించాడు. వారికి మనువు, యముడు, యమున అనే సంతానం కలిగింది. 
 
సూర్యుడి వేడి భరించలేని ఆమె తన రూపంతో ఛాయాదేవిని సృష్టించి తన స్థానంలో ఆమెను ఉంచి తాను వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగింది. సూర్యుడికి ఛాయాదేవిలకు శ్రుతశ్రవస్, శృతకర్మ అనే పుత్రులు, తపతి అనే పుత్రిక జన్మించారు. అందులో శృతకర్మయే శనైశ్చరుడు. ఆయన మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది. 
 
శనైశ్చరుడు భూలోకం చేరి కాశీ క్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి నవగ్రహాల్లో స్థానం పొందాడు. శనైశ్చరుడు నలుపు వర్ణంతో.. పొట్టిగా ఉంటాడు. ఈయన వాదనలు కలుగజేసే గుణం కలిగిన వాడు. దిక్కుల్లో పడమర, దేవతలలో యముడు, లోహాలలో ఇనుము, రాళ్ళల్లో నీలం, ధాన్యాలలో నువ్వులు, సమిధలలో జమ్మి, రుచుల్లో పులుపు, వస్త్రాల్లో నలుపురంగు శనైశ్చరుడికి ప్రియమైనవి. ఆయన వాహనం కాకి. ఈ స్వామిని శనివారం నాడు ఆరాధించడం శ్రేష్టం. అందుకు శనిత్రయోదశి మరింత ప్రశస్తమైనది.