బుధవారం, 15 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (14:05 IST)

తిరుమలలో మహిళా క్షురకులకు భద్రత ఎక్కడ...!

శ్రీవారి సేవకులుగా తిరుమలలో 930 మంది క్షురకులు పనిచేస్తున్నారు. పీస్‌ రేట్‌ కింద 278 మంది ఉన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులుగా 200 మందికిపైగా ఉన్నారు. వీరిలో మహిళలు 300 మంది దాకా ఉన్నారు. మొత్తం నాలుగు బ్య

శ్రీవారి సేవకులుగా తిరుమలలో 930 మంది క్షురకులు పనిచేస్తున్నారు. పీస్‌ రేట్‌ కింద 278 మంది ఉన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులుగా 200 మందికిపైగా ఉన్నారు. వీరిలో మహిళలు 300 మంది దాకా ఉన్నారు. మొత్తం నాలుగు బ్యాచ్‌లుగా పనిచేస్తుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 3, సాయంత్రం 3 నుంచి 9 గంటల దాకా, రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా, తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9 గంటల దాకా. ఇలా మొత్తం నాలుగు బ్యాచ్‌లు పనిచేస్తుంటారు.
 
వీరిలో మహిళలు ఉంటారు. రాత్రి 9 గంటలకు  డ్యూటీ అయిపోయే బ్యాచ్ మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు డ్యూటీ ఎక్కాలి. ఆ సమయంలో కిందకు వెళ్ళిరావడం సాధ్యం కాదు. అక్కడే పడుకోవాలి. అయితే వారికి తగిన ఏర్పాట్లు లేవు. కళ్యాణకట్టలోని వరండాల్లోనే అందరూ సామూహికంగా నిద్రిస్తుంటారు. దీంతో వారికి ఏ భద్రతా లేకుండా ఉంది. భయం భయంగా గడపాల్సి వస్తోంది. సాయంత్రం డ్యూటీ ఎక్కేటప్పుడు ఇంటి వద్ద స్నానం చేసి వస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు డ్యూటీ ఎక్కాలంటే స్నానాలు చేయడానికి ఏర్పాట్లు లేవు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలి.
 
అర్చకులకు అర్చక భవన్‌ ఉంది. ఉన్నతాధికారులకు ప్రత్యేక గదులు కేటాయిస్తున్నారు. క్షురకులను మాత్రం గాలికి వదిలేశారు. శ్రీవారి సేవ కింద పనిచేసే క్షురకులు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్నారు. వారికి బస్ పాస్ సదుపాయం కూడా లేదు. రోజూ కిందికి వెళ్ళి రావాలంటే 200 రూపాయలు ఖర్చవుతుంది. అందుకే కళ్యాణకట్ట వరండాల్లోనే గడిపేస్తుంటారు. లాకర్లలో చాప, దుప్పటి, దుస్తులు భద్రపరుచుకుని యాత్రికుల స్నానపు గదులు, మరుగుదొడ్లలోనే కాలకృత్యాలు తీర్చుకుని అక్కడే ఉంటున్నారు. ఈ సదుపాయమైనా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా లేవు. ఎప్పుడూ కనీసం 200 మంది క్షురకులు ఇక్కడ ఉంటారు. తగిన విశ్రాంతి లేకుంటే ఆ తర్వాత డ్యూటీలో పనిచేయడం కష్టమవుతోంది.
 
కళ్యాణకట్టలో పనిచేసే కార్మికుల కోసం తితిదే ఉద్యోగుల క్యాంటీన్‌ నుంచి ఉదయం, సాయంత్రం టిఫిన్‌ మధ్యాహ్నం, రాత్రి భోజనం పంపుతారు. బఫే పద్దతిలో వడ్డిస్తారు. అయితే భోజనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఇక్కడే నిలబడి తినాలి. కళ్యాణకట్టలో వెంట్రుకలు ఫ్యాన్ గాలికి ఎగిరి భోజనంలో పడుతుంటాయి. అయినా విధిలేని పరిస్థితుల్లో ఆ భోజనం తింటున్నారు. స్వామివారి వద్ద ఉద్యోగం దొరికిందన్న సంతోషంలో చాలామంది అప్పటిదాకా నడుపుతున్న సెలూన్లు మూసేసుకుని ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తలనీలాల ద్వారా తితిదేకి ఏటా 150 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నా తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని క్షురకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.