సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:58 IST)

సోమనాథ జ్యోతిర్లింగం ఎలా ఉద్భవించిందో తెలుసా?

కోటి సూర్యప్రకాశ సమమైన శివలింగం జ్యోతిర్మయ స్వరూపుడైన మహాశివుని ప్రతిరూపం. పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం. కంటికి కనిపిస్తున్న జగత్తంతా లింగం నందే ఇమిడి ఉంది. లింగమూలంలో బ్రహ్మ మధ్యన విష్ణువు, ఉపరి భాగమందు ఓంకార స్వరూపుడైన రుద్రమూర్తి సదాశివుడు ఉంటారు. ఇంతటి పరమ విశిష్టమైన పరమేశ్వరుని లింగ దర్శనాన్ని చేసినట్లయితే ఎంతో పుణ్యఫలదాయకం. అదే మహాముక్తికి సోపానం. సోమనాధ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన ఎలా జరిగిందో తెలుసుకుందాం.
 
ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మెుదటిది. దక్షుడు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లున్న తన కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేసాడు. వారందరూ సౌందర్యవతులే కానీ చంద్రుడు వారిలో రోహిణిని మాత్రమే బాగా చూసుకునేవాడు. అందుకే మిగతావారందరూ తమ తండ్రి వద్దకు వెళ్ళి చంద్రుడి గురించి చెప్పి ఎంతగానో బాధపడ్డారు. అందుకు దక్షుడు కోపించి చంద్రుణ్ణి, నీవు క్షయవ్యాధి పీడితుడవుతావంటూ శపించాడు. ఆ వ్యాధితో చంద్రుడు క్షీణించిపోసాగాడు.
 
అతడి తేజస్సు నశించింది. లోకాలకు ప్రతిరాత్రి చీకటి రాత్రైంది. అందుకు దేవతలు, మునులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి బాధపడ్డారు. అది విని బ్రహ్మ చంద్రుడితో నీవు సౌరాష్ట్రలో ఉన్న ప్రభాస తీర్ధానికి వెళ్లి పార్ధివ లింగాన్ని ప్రతిష్టించి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించమన్నాడు.
 
చంద్రుడు అలాగే చేశాడు. ఆ భక్తికి మెచ్చి శివుడు కరుణించి, క్షయ వ్యాధి బారి నుండి విముక్తి కలిగించి అనుగ్రహించాడు. ఆ విధంగా చంద్రుని ప్రార్ధన వల్ల ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి సోమనాధేశ్వరలింగంగా పేరు పొందాడు.