శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (14:58 IST)

సంక్రాంతికి ఎందుకు అంత విశిష్టత... (Video)

తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో లోగిళ్లు కొత్త అల్లుల్లతో, బంధుమిత్రులతో కళకళలాడతాయి. సంక్రాంతి విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకరరాశి అందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది. కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. సంక్రాంతి ముందు రోజువచ్చే పండుగ భోగి. తరువాత వచ్చేది మకర సంక్రాంతి, తరువాత వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
 
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి"గా పెద్దలు వివరణ చెబుతుంటారు. "మకరం" అంటే మొసలి. అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు.
 
సాధారణంగా డిసెంబర్ 22 తారీఖు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు. అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాపితామహుడు ఈ పర్వదినం వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి"మాఘ శుద్ధ సప్తమి" నాడు మొదలుకుని తన పంచప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మోక్షం పొందాడు. జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు. 
 
పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది. ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది. ఈవిధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియో చూడండి.