శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 డిశెంబరు 2018 (11:17 IST)

నుదుట కుంకుమ అందుకే పెట్టుకోవాలి...

స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్లినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడామగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుడుల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి. మన సంస్కృతీ సాంప్రదాయాలతో ఇంతగా పెనవేసుకుపోయిన కుంకుమ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం..
 
1. షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమనీ, లక్ష్మీదేవి వస్తుందనీ విశ్వసిస్తారు. పెళ్లయిన స్త్రీలు పసుపుని తాళిబొట్టుకు అద్దుకునీ, కుంకుమని ముఖాన దిద్దుతారు. జంట కవుల్లా ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి.
 
2. మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయట. అందులో ఆరో చక్రమే మూడో కన్ను. అంటే..... కనుబొమ మద్యన ఉన్న నుదురుభాగం. శరీరంలోకెల్లా ప్రధాన నాడీ కేంద్రమైన ఈ బిందువు శక్తినీ, ఏకాగ్రతని పెంచడంతో పాటు దుష్ట శక్తుల్ని దూరంగా ఉంచుతుందట. అందుకే అక్కడ కుంకుమని దిద్దితే అది నాడుల్ని ప్రేరేపిస్తుందని చెబుతారు. పాపిట సింధూరం ధరించడం కూడా అలాంటిదే. దానిని బ్రహ్మ రంధ్రము గానూ, ఆధ్యాత్మిక కేంద్రముగానూ చెబుతుంటారు.
 
3. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే... ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో... రాముడి ఆయుష్షు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామ భక్తుడైన హనుమ జానకీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామ భక్తే.... హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం.
 
4. పూర్వకాలం నుంచీ కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచునూరు పద్మావతీ దేవి, కాంచీపురంలోని శ్రీ కామాక్షి, కోల్ కత్తా లోని శ్రీ మహాకాళి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వుతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ దేవతకు అలంకరించిన మొగలిపూలనూ, కుంకుమనీ ప్రసాదంగా అందిస్తారు.