అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.