శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శనివారం, 23 జులై 2016 (12:07 IST)

శ్రీవారి ఆలయం 2.20 ఎకరాలు - మహద్వారం క్రీస్తు శకం 13వ శతాబ్దం...!

అదిగో.. ఆ కనబడేదే బంగారు మేడ (తిరుమల దేవాలయం) యొక్క ప్రధాన ప్రవేశద్వారం. సమస్త లోకాలకు అధిపతియైన తిరువేంకటగిరీశ్వరుని వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ వున్నట్లుగా మహోన్నతంగా పూర్వాభి (తూర్పు) ముఖంగా ప్రకాశిస్

అదిగో.. ఆ కనబడేదే బంగారు మేడ (తిరుమల దేవాలయం) యొక్క ప్రధాన ప్రవేశద్వారం. సమస్త లోకాలకు అధిపతియైన తిరువేంకటగిరీశ్వరుని వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ వున్నట్లుగా మహోన్నతంగా పూర్వాభి (తూర్పు) ముఖంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ మహద్వార గోపురానికి భక్తితో చేతులెత్తి దండాలు పెడదాం..
 
ఇలా స్వామివారిని స్మరిస్తూ ఉండగానే ఇదిగో అప్పుడే మహద్వారం వద్దకు వచ్చేశాం. ఈ ప్రధాన ద్వారానికే పడికాకలి అని, ముఖద్వారమని, సింహ ద్వారమని వేర్వేరు పేర్లు నిత్య వ్యవహారంలో ఉన్నాయి. తమిళంతో దీన్నే పెరియ తిరువాశల్‌ అని అంటారు. అనగా పెద్దవాకిలి అని అర్థం. 
 
ఈ మహద్వారం మీద ఎతైన గోపురం నిర్మించటానికి అనువుగా బలిష్టమైన శిలలతో ద్వారానికి లోవైపు, వెలుపలివైపు ఇరుప్రక్కల చౌకట్టు నిర్మింపబడింది. 38 - 32 కొలతలు గల దృఢమైన ఈ రాతి చౌకట్టుపై అనల్ప శిల్పకళాశోభితమైన ఐదు అంతస్తుల గోపురం నిర్మింపబడింది. ఈ గోపుర నిర్మాణం క్రీస్తు శకం 13వ శతాబ్ది నుంచి అంచెలంచెలుగా పెంపొందింపబడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదిగో ఆ గోపురంపై సువర్ణరంజితాలై ధగ దగ మెరుస్తున్న సప్త కలశాలను తిలకించండి! నేలమట్టం నుంచి ఈ గోపురం ఎత్తు యాభై అడుగులు. 
 
ఈ మహద్వారానికి అనుసంధింపబడి ఉన్న ప్రాకారమై మహాప్రాకారం. ఇది స్వామి వారి ఆలయం చుట్టూ పెద్ద పెద్ద శిలలతో సమున్నతంగా నాలుగు అడుగుల మందంతో సుమారు 30 అడుగుల ఎత్తుతో నిర్మింపబడింది. ఈ మహా ప్రాకారకుడ్యం పొడవు ఉత్తర దక్షిణంగా 263 అడుగులు, తూర్పు పడమరగా 414 అడుగులు, మొత్తం చుట్టూ కొలత 1354 అడుగులుగా అమరి ఉంది.
 
ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రధానమైన పురవీధులు తూర్పు దిక్కున ఉన్న వీధిని తూర్పు మాఢా వీధి అని, దక్షిణ దిక్కున దక్షిణ మాఢా వీధి అని, పడమర దిక్కున పశ్చిమ మాఢావీధి అని, అలాగే ఉత్తర దిక్కున ఉన్నది ఉత్తర మాఢా వీధి అని అంటారు. అలాగే శ్రీ స్వామివారి మహద్వార గోపురానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం వరకు ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఈ దేవాలయానికి తూర్పు మాఢ వీధి పొడవు 750 అడుగులు. దక్షిణ మాఢా, ఉత్తరపు మాఢా వీధుల పొడవు ఒక్కొక్కటి 800 అడుగులు. పడమటి మాఢ వీధి పొడవు 900 అడుగులు. ఈ నాలుగు మాఢ వీధుల గుండా ఆలయాన్ని చుట్టి వచ్చే మార్గానికి మహా ప్రదక్షిణ మార్గమని పేరు. 
 
ఈ మార్గంలోనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాలు, వూరేగింపులు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ మహాప్రదక్షిణం మొత్తం విస్తీర్ణం 16 ఎకరాలు. ఈ ప్రదేశంలోనే శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలాయం, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీ స్వామి పుష్కరిణి, పాత పుష్కరిణి షెడ్లు, శ్రీవారి అర్చకుల ఇళ్ళు మొదలైనవన్నీ చోటుచేసికొని ఉన్నాయి. అయితే ఇటీవల నానాటికీ పెరిగిపోతున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా క్షేత్ర విస్తీర్ణం కోసం ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్న మఠాలు, సత్రాలు పడగొట్టి విశాలంగా తీర్చిదిద్దబడుతున్నది.
 
వీటిలో శ్రీవారి ఆలయం 2.20ఎకరాలు, పుష్కరిణి వైశాల్యం 1.50ఎకరాలు, పాత పుష్కరిణి క్యూ షెడ్లు - 2.50 ఎకరాలు, వరాహస్వామి ఆలయం, మిగిలినవి 10.00 ఎకరాలు. మొత్తం 16.2 ఎకారాలు.
 
మహద్వార ప్రవేశమార్గం చూశారా.. ఈ మార్గం 32 - 99 పొడవు, వెడల్పులతో విరాజిల్లుతోంది. ప్రవేశమార్గంలో తూర్పునకు, పడమటికీ రెండువైపుల సరిసమాన దూరంలో రెండు చెక్కడపు రాతి ద్వారా బంధాలు బిగించబడ్డాయి. బయటివైపున ఉన్న మొదటి ద్వార బంధానికి ఎతైన రెండు పెద్ద చెక్కవాకిళ్ళు అమర్చబడి ఉన్నాయి. ఈ వాకిళ్ళు చిరుగంటలతో అలంకృతాలై ఉన్నాయి. ఈ రెండు వాకిళ్లలో ఉత్తరం వైపున ఉన్న వాకిలిలో చిన్న తలుపు ఏర్పరచి ఉంది. మహద్వారం మూసి ఉంచినప్పుడు ఆవశ్యకతను అనుసరించి ఆయా సమయాల్లో ఆలయ సిబ్బంది మాత్రం ఈ చిన్న తలుపు ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
 
ఇటీవల (1996 జనవరి) ఈ పెద్దవాకిళ్లకు ఇత్తడి రేకు తాపబడింది. అందువల్ల దీనిని ఇత్తడి వాకిళ్ళు అనవచ్చు. లోపల వెండివాకిళ్ళు, బంగారు వాకిళ్ళు కూడా ఉన్నాయి. నిత్యకళ్యాణం..పచ్చతోరణం అన్న ప్రసిద్ధికి తగినట్లుగా పచ్చని మామిడాకు తోరణాలతో ఎతైన అరటి స్తంభాలతో ఈ పడికావలి ప్రవేశద్వారం నిత్యమూ కళకళలాడుతూ ఉంటుంది.