సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (21:05 IST)

అసలు పతివ్రతల కథలు ఎందుకు? (వీడియో)

మన పూర్వీకులు మేథావులు. దూరదృష్టి కలిగినవారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ మానవాళికి మార్గదర్శకాలు. పురాణాలు, ఇతిహాసాలను లోతుగా పరిశీలిస్తే ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి త

మన పూర్వీకులు మేథావులు. దూరదృష్టి కలిగినవారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ మానవాళికి మార్గదర్శకాలు. పురాణాలు, ఇతిహాసాలను లోతుగా పరిశీలిస్తే ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి తోడ్పడే ఎన్నో అంశాలు ఉపాఖ్యానాల రూపంలో దర్శనమిస్తాయి. ఇందులో స్త్రీ పాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. ముఖ్యంగా పతివ్రతల కథలు స్త్రీల అభ్యుదయానికి మేలుకొలుపుల వంటివి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోనివారు మాత్రమే ఈ కథలు స్త్రీ స్వేచ్చకు  ప్రతిబంధకాలని అనుకుంటారు. అయితే  ఆయా పురాణాలలోని పతివ్రతలందరూ ఎన్నో విధాలైన  కష్టాలు పడినట్లు ఉన్నా ఎవరూ కూడా  అబలలమని కన్నీరు కారుస్తూ  చతికిలపడలేదు. 
 
విధినే ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. కన్నవారు, కట్టుకున్నవాడు, సమాజం, చివరకు ప్రార్ధించే భగవంతుడు... ఇలా ఎవరి వల్ల ఆపద వాటిల్లినా, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వ జగత్తు తలవంచి దాసోహమనేలా చేసుకున్న ఆ స్త్రీలు ఆదర్శప్రాయం. ఈక్రమంలో ఆమెకు ఎన్నో ఆటంకాలు, ఒడుదుడుకులు ఎదురవుతాయి. వాటన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని చిన్నతనం నుండే నూరిపోసే క్రమంలో భాగంగానే ఆనాటి పెద్దలు  పురాణాలలోని పతివ్రతల కథలు చెప్పడం వారిని స్మరిస్తూ నోములు  వ్రతాలు చేయించడం అనే ఆచారాలు ఏర్పరచారు. 
 
ఆలోచిస్తే... పెద్దల అడుగు జాడలలో ఎందుకు నడవాలో అవగతం అవుతుంది. వారు చేప్పినట్లు పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు  చదివితే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప వారినేదో చదువులేని దద్దమ్మలుగా వంటింటి కుందేలుగా చేయడానికి కాదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుండే నిజాయితీని, సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, వివేకంతో కూడిన ఆలోచన విధానాన్ని నేర్పించాలి. ఈ తరం పిల్లలు చిన్న సమస్య వచ్చినా దానిని తట్టుకునే శక్తి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనుక తల్లిదండ్రులు పిల్లలకు జీవితం పట్ల సరైన అవగాహన కల్పించాలి. పంచతంత్రం కథ వీడియో చూడండి...