శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (21:27 IST)

జూలై 1, తొలి ఏకాదశి: విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే...? (video)

రేపు తొలిఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. చాలా పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువు శయన నిద్రలోకి వెళ్ళే రోజును శయన ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఉండి ఉపవాసదీక్షలు చేస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. 
 
తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ద్వాదశి రోజు ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని విష్ణు మూర్తిని భక్తిశ్రద్థలతో పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రకృతి పర్యావరణంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని కారణంగా మన శరీరానికి బద్ధకం ఏర్పడి రోగాలు మనల్ని బాధిస్తాయి. ఏకాదశి ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై మన దేహం కూడా నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది.
 
ఇంద్రియ నిగ్రహాన్ని, అంతేగాక క్లిష్ట పరిస్థితుల్లో భయంకర రోగాలు ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ తొలి ఏకాదశికి పేలాల పిండిని తినే ఆచారం ఉంది. పేలాలలో బెల్లం, యాలకులను చేర్చి ఈ పిండిని తయారుచేస్తారు.
 
అలాగే తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. చాలామందికి తెలియక తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తీసుకోరు. ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తీసుకుంటే ఉపవాస దీక్షకు ఎంతో పుణ్యం వస్తుందట. ఆషాఢ మాసంలో వచ్చే ప్రకృతి మార్పులను ఎదుర్కోవడానికి ఈ పేలాల పిండి ఎంతగానో సహకరిస్తుందట. 
 
పేలాలు జొన్నల నుంచి తయారుచేస్తారు. జొన్నలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనలోని రోగాలు తగ్గించడానికి ఇమ్యునిటీ పవర్‌ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి పేలాల పండుగగా పిలువబడే తొలి ఏకాదశినాడు అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు సైన్స్ పరంగా కూడా గొప్ప విలువను సంతరించుకున్న పేలాలను ప్రతి ఒక్కరు తినాలట.