జూన్ మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతిరోజు ఉత్సవ దినమే. శ్రీవారికి ఏడాది పొడవునా 450 పర్వదినాలు నిర్వహిస్తున్నారన్నది తిరుమల చారిత్రక ప్రాశస్త ప్రామాణికం. కాగా జూన్ నెలలో కూడా అనేక పర్వదినాలు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు.
జూన్ 1, 16, 30వ తేదీలలో ఏకాదశి, జూన్ 1న శ్రీ మహీజయంతి, జూన్ 6వ తేదీ బుద్ధ జయంతి, చంద్రదర్శనం, జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం, జూన్ 20వ తేదీ శ్రీవారి పౌర్ణమి గరుడోత్సవం, మే 31వ తేదీ తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు జరుగనున్నాయి.
తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం, మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద మే 31వ తేదీన హనుమజ్జయంతి వేడుకలను తితిదే ఘనంగా నిర్వహించనుంది.
శరణాగత భక్తికి ఆదర్శనంగా నిలిచిన ఆంజనేయ స్వామివారి జయంతిని తితిదే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడో మైలులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సాయంత్రం 3 గంటలకు పూజలు చేస్తారు.