బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 నవంబరు 2024 (22:53 IST)

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: అద‌ర‌గొట్టిన తెలుగు టైటాన్స్‌, బెంగళూర్‌ బుల్స్‌పై 38-35తో విజయం

Kabaddi
తెలుగు టైటాన్స్‌ పంజా విసిరింది. బెంగళూర్‌ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్‌లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లు పవన్‌ సెహ్రావత్‌ (14 పాయింట్లు), ఆశీష్‌ నర్వాల్‌ (6 పాయింట్లు), అజిత్‌ పవార్‌ (5 పాయింట్లు), విజయ్‌ మాలిక్‌ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్‌ (9 పాయింట్లు), నితిన్‌ రావల్‌ (7 పాయింట్లు), రెయిడర్‌ అజింక్య పవార్‌ (9 పాయింట్లు), డిఫెండర్‌ అరుల్‌ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్‌ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ సీజన్లో అత్యధిక రెయిడ్‌ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 
 
తెలుగు టైటాన్స్‌ పంజా : 
ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌ అదరగొట్టింది. బెంగళూర్‌ బుల్స్‌పై ధనాధన్‌ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్‌ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్‌ సెహ్రావత్‌, ఆశీష్‌ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్‌ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్‌ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్‌ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్‌ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది. 
 
బుల్స్‌ మెరుపు వేగంతో.. : 
విరామం అనంతరం బెంగళూర్‌ బుల్స్‌ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్‌ ఆలౌట్‌ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్‌ బుల్స్‌. స్టార్‌ రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ విఫలమైతే.. టైటాన్స్‌ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్‌ బుల్స్‌ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది.