మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (22:12 IST)

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి, 41-37తో దబంగ్‌ ఢిల్లీ కెసి గెలుపు

Kabaddi
ప్రొ కబడ్డీ లీగ్‌లో సీజన్‌ మారినా.. తెలుగు టైటాన్స్‌ కథ మారటం లేదు. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో టైటాన్స్‌ హ్యాట్రిక్‌ పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శనివారం దబంగ్‌ ఢిల్లీ కెసితో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 37-41తో ఓటమి చెందింది. దబంగ్‌ ఢిల్లీ కెసి ఆటగాళ్లలో నవీన్‌ కుమార్‌, ఆషు మాలిక్‌ 15 పాయింట్ల చొప్పున సూపర్‌ షో చేశారు. తెలుగు టైటాన్స్ తరఫున పవన్‌ సెహ్రావత్‌ 18 పాయింట్లతో చెలరేగినా ఫలితం దక్కలేదు. ఆశీస్‌ నర్వాల్‌ 9 పాయింట్లతో రాణించినా.. తెలుగు టైటాన్స్‌ 4 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. పీకేఎల్‌ 11వ సీజన్లో మూడు మ్యాచుల్లో దబంగ్‌ ఢిల్లీ కెసికి రెండో విజయం కాగా.. తెలుగు టైటాన్స్‌కు నాలుగు మ్యాచుల్లో ముచ్చటగా మూడో ఓటమి. 
 
టైటాన్స్‌ శుభారంభం: 
సొంతగడ్డపై ఆడిన తొలి మూడు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించిన తెలుగు టైటాన్స్‌.. నాల్గో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. దబంగ్‌ ఢిల్లీ కెసితో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ప్రథమార్థంలో శుభారంభం చేసింది. స్టార్‌ రెయిడర్‌ పవన్‌ సెహ్రావత్‌ తొలి 20 నిమిషాల్లోనే సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో మెరిశాడు. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి తెలుగు టైటాన్స్‌ 20-15తో దబంగ్‌ ఢిల్లీ కెసిపై ఐదు పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ మెరిసిన టైటాన్స్‌.. దబంగ్‌ ఢిల్లీ కెసిని ఓసారి ఆలౌట్‌ చేసింది. 
 
సెకండ్‌హాఫ్‌లో చతికిల : 
విరామం అనంతరం తెలుగు టైటాన్స్‌ భిన్నమైన జట్టుగా కనిపించింది. ఆట మొదలైన 5 నిమిషాల్లో ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయింది. ఇదే సమయంలో దబంగ్‌ ఢిల్లీ కెసి వరుస పాయింట్లతో దూసుకొచ్చింది. 24వ నిమిషంలోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. దబంగ్‌ ఢిల్లీ కెసి తరఫున రెయిడర్లు నవీన్‌ కుమార్‌, ఆషు మాలిక్‌లు సూపర్‌ టెన్‌ షోతో ఆకట్టుకున్నారు. మరో 10 నిమిషాల ఆట మిగిలిఉండగా తెలుగు టైటాన్స్‌ 24-30తో ఆరు పాయింట్ల వెనుకంజలో నిలిచింది.