సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (08:33 IST)

ఐపీఎల్ 2024 : ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

srh vs gt
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 26వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. అయితే, ఐపీఎల్ 17వ సీజన్‌లో లీగ్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఫలితంగా హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరింది.
 
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాలని భావించారు. ఓ దశలో వరుణుడు కాస్త శాంతించడంతో మ్యాచు నిర్వహించేందుకు వీలుగా మైదానాన్ని గ్రౌండ్ స్టాఫ్ శరవేగంగా సిద్ధం చేశారు. రాత్రి 8 గంటలకు టాస్ వేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఇకపోతే, ఆరెంజ్ ఆర్మీ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగాలంటే కోల్‌కతాతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో కిందికి వస్తుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌కు వెళ్తుంది.
 
గుజరాత్‌తో మ్యాచ్ రద్దు కావడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ముంబైపై లక్నో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. శనివారం ఆర్సీబీ, చెన్నై మ్యాచ్ జరగనుంది. దీంట్లో నెగ్గితే సీఎస్కే నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్తుంది. ఇతర జట్లు ఇంటి ముఖం పడతాయి. 
 
ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ రద్దయితే చెన్నై 15 పాయింట్లతో ముందంజ వేస్తుంది. మ్యాచ్ జరిగి బెంగళూరు విజయం సాధిస్తే ఆర్సీబీ, చెన్నై, ఢిల్లీ, లక్నో 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, ఢిల్లీ, లక్నో మైనస్ నెట్ రన్‌రేట్‌తో ఉండటంతో చెన్నై, బెంగళూరులలో ఏదో ఒక జట్టు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.