కరీంనగర్ ఎంపీగా మళ్లీ గెలిస్తే భారాస దుకాణం మూసేస్తారా? కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్..
గుడ్డిలో మెల్లగా కరీంనగర్ ఎంపీగా గెలిచారంటూ తన గురించి భారత రాష్ట్ర సమితి నేతలు చేస్తున్న ప్రచారం, కామెంట్స్‌పై కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిస్తే భారత రాష్ట్ర సమితి దుకాణం మూసివేస్తారా అని ప్రశ్నించారు. అలాగే, ఒకవేళ తాను ఆ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తాను గెలిస్తే కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారా అని నిలదీశారు.
తాను చేపట్టిన ప్రజాహిత యాత్రలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. చొప్పదండి అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్ చేసిన సవాలును స్వీకరిస్తున్నానని అన్నారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్‌ను కూడా తీసుకు రావాలని అన్నారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ తెరచి అద్దె చెల్లించకుండా అక్కడి నేతలను మోసం చేశారని కేసీఆర్, కేటీఆర్లపై సంజయ్ ఆరోపించారు.
మరో వ్యక్తి గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో కరీంనగర్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. బండి సంజయ్ ఎప్పుడూ రాముడి పేరు చెబుతుంటారని తనను విమర్శిస్తున్నారని, రాముడి పేరు కాకపోతే రావణుడి పేరు చెప్పాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.