శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (11:01 IST)

ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణాలో ఒంటిపూట బడులు...

schools
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఒక్క పూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయింది. ఒంటి పూట బడులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు నిర్వహించాలని ఆదేశించింది. ఒకవేళ, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్‌ 23 వరకు ఇదే పద్ధతి కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంటుంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఈ సారి సైన్స్‌ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 
 
పార్ట్‌-1లో ఫిజికల్‌ సైన్స్‌, పార్ట్‌-2లో బయాలజీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం (040-23230942)ను సంప్రదించి, విద్యార్థులు అవసరమైన సేవలను పొందవచ్చని అధికారులు సూచించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించారు. 
 
అలాగే www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే.. సంబంధిత ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మ్యాథ్స్‌, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షల్లో మొత్తం 13 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఈ పరీక్షలకు 3,75,157 మంది హాజరు కావాల్సి ఉండగా 3,66,389 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరీంనగర్‌లో 2, వికారాబాద్‌లో 9, ములుగులో 2 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి.