ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (14:43 IST)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు : హరీశ్ రావు ప్రశ్న

harish rao
తమ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు మహేందర్ రెడ్డికి శాసనమండలి చీఫ్ పదవికి ఎలా ఇచ్చారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు చీఫ్ విప్ పదవి ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ అని అన్నారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని మండిపడ్డారు. 
 
మహేందర్ రెడ్డిపై ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. మండలి చీఫ్ విప్‌గా ఆయనను నియమిస్తూ చైర్మన్ ఇచ్చిన బులిటెన్ తమ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూరిందన్నారు. అనర్హత పిటిషన్‌లో దీనిని సాక్ష్యంగా చూపుతామన్నారు. 
 
ఆగస్టు 15న, సెప్టెంబరు 17న ఎమ్మెల్సీ హోదాలోనే మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ విప్ అని బులిటెన్ ఇచ్చారని గుర్తుచేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాము లేఖ రాశామని, రాష్ట్ర గవర్నర్‌తో పాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తామన్నారు. అధికార పార్టీ గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.