బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జనవరి 2025 (20:04 IST)

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

train
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ రద్దీని నివారించేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచినవారు ఈ నెల రెండో తేదీ నుంచి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. కాచిగూడ - కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌ - కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్‌ రిజర్వేషన్ల బుకింగ్‌ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని పేర్కొన్నారు.
 
కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్‌ - కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.
 
అలాగే, హైదరాబాద్‌ - కాకినాడ పట్టణం రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.