ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (13:35 IST)

ఇపుడు ఇచ్చిన ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మార్గదర్శకాలను  రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. ఇపుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ఆయన శుక్రవారం ప్రకటించారు. 
 
'వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. అప్పుడు నాతో పాటు సంపత్‌ కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పింది. అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారు. డిసెంబర్‌ 3, 2023న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను ఢిల్లీకి పంపించాం. న్యాయకోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం వినిపించింది. 
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను' అని సీఎం కోరారు.