మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పైన కేసు నమోదు
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా, ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం ధూళికట్ట గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు ఓ ప్రతిజ్ఞ చేయించారు.
హిందూ దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించం అని, గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల మీద కూడా నమ్మకం లేదని, వాళ్ళను పూజించం అని, శ్రాద్ధ కర్మలు పాటించమని, పిండదానాలు చేయబోమంటూ.. హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞ అది. అందులో స్వేరోస్ సభ్యులతో పాటు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేశారంటూ కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 16న ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కరీంనగర్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి, మరో న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ సహాయంతో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సాయిసుధ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు.