శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (15:43 IST)

ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిలను కలిసిన యాంకర్ శ్యామల

వైఎస్సార్‌ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. షర్మిల పాదయాత్ర‌కు మద్దతు ప్రకటించి షర్మిలలో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్.రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ లేడి యాంకర్ శ్యామల సైతం షర్మిల పాదయాత్ర‌లో పాల్గొంది.
 
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ, సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని ప్రకటించారు. గత ఎనిమిది రోజులుగా అక్క నడుస్తున్నారని… ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారన్నారు. 
 
ఈ విషయాన్ని తాను స్వయంగా చూశానని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరో సీఎం చెల్లెలు అయిన అక్క ఎంతో సంతోషంగా ఉండొచ్చని… కానీ వారి నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని యాంకర్ శ్యామల గుర్తుచేశారు.
 
కాగా, గతంలో తన భర్త న‌ర‌సింహా రెడ్డితో కలిసి వెళ్లిన శ్యామల.. షర్మిలతో ఒకసారి భేటీ అయ్యారు. ఈ భేటీ 15 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించారు. పార్టీ పెడితే తాము కూడా కండువా కప్పుకుంటామని అపుడే వారు సంకేతాలు ఇచ్చారు. 
 
అలాగే, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ శ్యామల, ఆమె భర్త ఇద్దరూ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్న విషయం తెల్సిందే. ఇపుడు తెలంగాణాలో కూడా వారు షర్మిలతో కలిసి నడవనుండటం గమనార్హం.