గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (09:27 IST)

నేటి నుంచి వైఎస్.షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. 
 
వైతెపాను స్థాపించిన ఆమె తాజాగా మరోమారు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించి 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. తిరిగి అక్కడే ముగించనున్నారు. ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భవించగా.. పాదయాత్ర చేపడతామని ఆ రోజే షర్మిల ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్‌ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది.
 
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తొలి రోజున చేవెళ్ల.. వికారాబాద్‌ రోడ్డులోని కేజీఆర్‌ గార్డెన్‌ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులను తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ.., అనంతరం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. 
 
వైఎస్‌ విజయమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చేవెళ్ల పట్టణం మీదుగా పాదయాత్ర ప్రారంభించి కందవాడ - నక్కలపల్లి శివారుకు షర్మిల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. నిత్యం సగటున 12 కి.మీ.లు నడిచేలా షెడ్యూలు రూపొందించినట్లు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.