గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (08:47 IST)

ఏపీ ఎమ్మెల్యేలపై జనాగ్రహం - సీఎం కేసీఆర్‌పై ప్రజాగ్రహం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అధికార వైకాపా ఎమ్మెల్యేలు రెండున్నరేళ్లలో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారు. దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా ‘రికార్డు’ సాధించారు. ‘సీ-ఓటర్‌’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. 
 
‘ఐఏఎన్‌ఎస్‌ - సీ ఓటర్‌ పరిపాలన సూచీ’ పేరిట చేపట్టిన సర్వే ఫలితాలను ఐఏఎన్‌ఎస్‌ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం... దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఏపీ ఎమ్మెల్యేలపైనే కనిపించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై 28.5శాతం మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఏపీ తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజలు అత్యధిక ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా రెండోస్థానంలో (24.3 శాతం) ఉంది. ఇక... ఎమ్మెల్యేలు 23.5 శాతం వ్యతిరేకత/ఆగ్రహంతో మూడో స్థానంలో నిలిచారు. ‘సీ-ఓటర్‌’ ముఖ్యమంత్రులపైనా సర్వే చేసింది. 
 
అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిస్థానంలో నిలిచారు. ఆయనపై 30.30శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై 28.1 శాతం వ్యతిరేకతతో రెండో స్థానంలో ఉన్నారు.
 
అదేసమయంలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ నిలిచారు. ఐఏఎన్ఎస్-సీఓటర్ నిర్వహించిన సర్వేలో ఆయన బెస్ట్ సీఎంగా నిలిచారు. 94 శాతం మంది ఆయన పాలన పట్ల తృప్తిని వ్యక్తపరిచారు. మొత్తం 115 పరామితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
 
ఈ సందర్భంగా సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ... సీఈవో తరహాలో పాలిస్తున్న ముఖ్యమంత్రులనే ప్రజలు ఇష్టపడుతున్నారన్నారు. సర్వేలో రెండో బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాప్యులారిటీ బాగా పడిపోతోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 
 
కేసీఆర్‌పై అత్యంత వ్యతిరేకత ఉండడమేకాకుండా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పనితీరుపై మంచి రేటింగ్‌ ఉన్న రీత్యా రాష్ట్రంలోకి బీజేపీ ప్రవేశించడానికి మార్గం ఉంది. ఇకపోతే, 28.1 శాతం మంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెప్పారు.