1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:07 IST)

ఏపీలో ఉద్యోగాల భర్తీకి సిద్ధం.. 20న తొలి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి బోధనాస్పత్రులు, ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. 
 
ఇందులో ఎలాంటి రాజీకి ఆస్కారం లేదన్నారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బంది నియామకంపై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. 
 
వివిధ ఆస్పత్రుల్లో నియామకాలు వెంటనే పూర్తిచేయాలని నిర్దేశించారు. గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల కేలెండర్‌ను రూపొందించామని అధికారులు సీఎంకు తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో పోస్టుల భర్తీకి బుధవారం (20న) నోటిఫికేషన్‌ ఇస్తామని.. ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 10న నియామక ఉత్తర్వులిస్తామని వెల్లడించారు. 
 
అలాగే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 5 నాటికి, వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)లో డిసెంబరు 21-25 తేదీల మధ్య నియామక ఉత్తర్వులిస్తామన్నారు.