సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:27 IST)

20 నుంచి షర్మిల పాదయాత్ర ... 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుటనున్నారు ఈ నెల 20వ తేదీన చేవెళ్ల మండలం శంకరపల్లి నుంచి ఆమె తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు.
 
మొత్తం 400 రోజులపాటు జరిగే పాదయాత్ర 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 
 
అలాగే, ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. 20న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారని వైతెపా చేవెళ్ల పార్లమెంటు కన్వీనర్‌ కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.