షర్మిలతో ఎన్నికల వ్యూహకర్త పీకే బృందం భేటీ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయింది.
ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో విజయానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవలు తీసుకోనున్నట్టు షర్మిల ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో స్పష్టంచేశారు. ఆమె చెప్పిన రోజుల వ్యవధిలోనే పీకే టీమ్ రంగంలోకి దిగింది.
రాబోయే ఎన్నికల సమయానికల్లా పార్టీని ఇతర ప్రధాన పార్టీలకు ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా పీకే టీమ్ పని చేయనుంది. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది.