ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:45 IST)

భార్యాభర్తలైన అన్నా చెల్లెళ్లు.. విషయం తెలియడంతో చివరకు...

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, వారిద్దిరిలో ప్రియురాలికి అతను ఏం వరుస అవుతాడో తెలియదు. కానీ, ప్రియుడుకు మాత్రం ఆ యువతి చెల్లి వరుస అవుతుందని ముందుగానే తెలుసు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ యువతిని పెళ్లాడాడు. కానీ, ఈ విషయం ఆ యువతికి తెలిసింది. అంతే.. అన్నను పెళ్లి చేసుకున్నానన్న అవమాన భారాన్ని భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ, తృటిలో ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు. 
 
ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ జిల్లాకు చెందిన యువతి (21), యువకుడు (24) ఏడాదిగా ప్రేమించుకున్నారు యువకుడికి తన సోదరి ద్వారా ఆ యువతి పరిచయమైంది. వీరిద్దరూ పది రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులో ప్రేమ వివాహం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారుంటున్నారు. ఇటీవల వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆ ఫొటోలను చూసిన బంధువులు ఇద్దరూ దూరపు బంధువులు అవుతారని, వరుసకు సోదరి, సోదరులని తేల్చారు. ఈ విషయం తెలిసిన యువతి మనస్తాపంతో పురుగులమందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.
 
యువతి ఆత్మహత్య విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగులమందు తాగి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.