సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు...
తెలంగాణ కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై సర్వే దాడికి పాల్పడ్డారు.
దీంతో సర్వే సత్యనారాయణ దురుసు ప్రవర్తన నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. సర్వే సత్యనారాయణకు అనేక సార్లు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చినా.. సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తంచేశారు.
గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్వే సత్యనారాయణ 2004లో సిద్దిపేట నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2009లో మల్కాజిగిరి పార్లమెంట్ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో జాతీయ రహదారులశాఖ మంత్రిగా పనిచేసిన సర్వే.. 2014 జనరల్ స్థానం మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
అదేవిధంగా 2015 వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ పాలక వర్గం ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ కొడుకు, కూతురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సర్వే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.