బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (09:47 IST)

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త!

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త! హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చే సుంకిశాల ప్రాజెక్టు పనులు వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ తాగునీటి ప్రాజెక్టును రూ.1,450కోట్లతో చేపడుతున్నారు. ఇందులో రూ.1167.94 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ షాఫ్ట్‌, ఇన్‌టెక్‌ టన్నెల్‌, పంప్‌హౌస్‌ సూపర్‌ స్ట్రక్చర్‌, ఎలక్ట్రో మెకానికల్‌ ఎక్విప్మెంట్‌, సుంకిశాల నుంచి కోదండాపూర్‌ నీటి శుద్ధి కేంద్రం వరకు భారీ పైపులైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

రూ. 274 కోట్లు విద్యుత్‌ పనుల కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు వాటర్‌ బోర్డు పిలిచిన టెండర్లకు పలు సంస్థలు పోటీ పడగా, ఎల్‌1గా నిలిచిన మెగా సంస్థ పనులు దక్కించుకుంది. దాంతో పనులు ప్రారంభాని కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. 

సోమవారం సంబంధిత సంస్థకు పనులు చేపట్టేందుకు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నారు.  వచ్చే నెల మొదటివారంలో పనులు ప్రారంభమవ్వనున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
 
నగరానికి నాగార్జునసాగర్‌  నుంచి కృష్ణా జలాలను  తరలిస్తున్న వాటర్‌ బోర్డు నగరంలో నీటిని సరఫరా చేస్తోంది. అయితే, నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకు చేరితే, నీటి తరలింపులో ఇబ్బందులు తలెత్తుతాయి. నీటిమట్టం 510 అడుగులకు చేరిన వెంటనే నగరానికి అత్యవసరం పంపింగ్‌ చేపడుతారు. ఇందుకోసం ఏటా వేసవికి ముందే వాటర్‌ బోర్డు రూ. కోట్లు వెచ్చిస్తోంది. 

ఈ నేపథ్యంలో సాగర్‌లో నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి చేరినా నగరానికి నీటిని పంపింగ్‌ చేసేలా సుంకిశాల ప్రాజెక్టుకు డిజైన్‌ చేశారు. ముంబై కంపెనీకి చెందిన టాటా కన్సల్టెన్సీ బృందం సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.1450కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రూపొందించగా, వాటర్‌బోర్డు ప్రభుత్వానికి అందజేసింది.

రాష్ట్రానికి వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా, కృష్ణా జలాల తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుంకిశాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.725కోట్ల నిధులను కేటాయించారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులిచ్చింది.