బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:29 IST)

'ప్లీజ్ టీచర్... ఐ డోంట్ డూ ఎగైన్' అంటూ వాపోయిన చిన్నారి : కేటీఆర్ ఏమన్నారంటే..

స్కూలుకు యూనిఫాం వేసుకురాలేదన్న కారణాన్ని చూపుతూ, బాలికను అమానుషంగా అబ్బాయిల టాయిలెట్‌లో నిలబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్

స్కూలుకు యూనిఫాం వేసుకురాలేదన్న కారణాన్ని చూపుతూ, బాలికను అమానుషంగా అబ్బాయిల టాయిలెట్‌లో నిలబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్ స్కూల్‌లో 11 ఏళ్ల బాలిక‌ను బాయ్స్ టాయిలెట్‌లో నిల‌బెట్టిన విషయం తెల్సిందే. ఇది అమాన‌వీయ ఘ‌ట‌న అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి దృష్టికి తీసుకెళ్లి.. స్కూల్‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. 
 
అస‌లేం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే... జిల్లాలోని రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్ స్కూల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక స్కూల్‌కు యూనిఫాం వేసుకోకుండా వెళ్లింది. దీంతో యూనిఫాం వేసుకురాలేద‌ని బాయ్స్ టాయిలెట్స్‌లో నిల‌బెట్టి ఆ అమ్మాయిని స్కూల్ ఉపాధ్యాయుడు శిక్షించాడు. ఈ విష‌యం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్ స్కూల్‌పై కేసు న‌మోదు చేసి చిన్నారిని శిక్షించిన ఆ టీచ‌ర్‌ను వెంట‌నే ఉద్యోగంలో నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని త‌ల్లిదండ్రులు, బంధువులు పాఠ‌శాల‌కు చేరుకొని ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. స్కూల్‌లో ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు.
 
కాగా, ఇక జరిగిన ఘటనపై ఆ చిన్నారి మాట్లాడుతూ, తాను యూనిఫాం వేసుకు వెళ్లని కారణాన్ని క్లాస్ టీచర్‌కు చెబితే ఆమె సరేనని క్లాసులోనే కూర్చోబెట్టిందని, చివరి పీరియడ్‌లో వాష్ రూమ్‌కు వెళ్లి వస్తుంటే పీఈ టీచర్ ప్రియాంక చూసి తనను పిలిచి, డ్రస్ గురించి అడిగిందని చెప్పింది. మా మమ్మీ వాష్ చేస్తే, ఆరలేదని తాను చెప్పానని, ఆ వెంటనే ఈ రోజు స్కూల్ ఉందని మీ మమ్మీకి తెలియదా? అని ఆమె అరిచారని, ఆ వెంటనే తనకు భయం వేసిందని చెప్పింది. 
 
తానేమీ మాట్లాడలేకపోగా, టీచర్ అరుస్తూనే ఉందని, ఆపై తనను తీసుకెళ్లి వాష్ రూమ్‌కు తీసుకెళ్లి, ఇక్కడే ఉండాలని చెప్పింది. "నేను ప్లీజ్ టీచర్... ఐ డోంట్ డూ ఎగైన్" అని చెప్పినా వినలేదు. పిల్లలందరూ తనను చూసి నవ్వారని వాపోయింది. ఇక జరిగిన ఘటనతో తన బిడ్డ స్కూలుకు వెళ్లనని మారాం చేస్తోందని, చదువు అవసరమా? అని ప్రశ్నిస్తే తనకెంతో బాధ కలిగిందని బాలిక తండ్రి వెల్లడించాడు.