క్రెడిట్ కార్డ్ పాయింట్ల్ రీడీమ్ చేస్కోండనగానే 12 సార్లు ఓటీపి చెప్పాడు, అంతే.. రూ. 1.75 లక్షలు గాయబ్
కేటుగాళ్లు ఎలా బుట్టలో వేయాలో బాగా ట్రైనింగ్ పొంది వుంటారు. ఈ కేటుగాళ్లు హైదరాబాద్ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ ఖాతాదారుడిని నమ్మించి 12 సార్లు ఓటీపి చెప్పించుకుని అతడి ఖాతా నుంచి రూ. 1.75 లక్షలు కొట్టేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పాయింట్లు ఎక్స్ పైరీ అయిపోతున్నాయంటూ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ వ్యక్తికి కేటుగాళ్లు ఫోన్ చేసారు. అది నిజమే అని నమ్మి ఆ వ్యక్తి వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టారు. మీ పాయింట్లు రీడీమ్ అవుతున్నాయి, ఒకసారి ఓటీపి చెప్పండి అంటూ మొత్తం 12 సార్లు చెప్పించుకున్నారు.
ఆ ఓటీపి ద్వారా అతడి ఖాతా నుంచి ఏకంగా రూ. 1. 75 లక్షలు కొట్టేశారు. డబ్బు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.