బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింక్ చేస్తామని కాల్ చేస్తే.. ఓటీపీ చెప్పకండి..
బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలాఖరులోపు లేకుంటే.. 2021 మార్చి 31 కల్లా కచ్చితంగా అన్ని అకౌంట్లు ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవాలని మంత్రి తెలిపారు. బ్యాంక్ కస్టమర్లు వారి అకౌంట్లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చునని ప్రకటించారు.
ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకపోతే పలు సర్వీసులు పొందడం వీలుకాకపోవచ్చు. అయితే ఆధార్‌తో అకౌంట్‌ను లింక్ చేసుకున్న తర్వాత మళ్లీ అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇక్కడ బ్యాంక్ కస్టమర్లు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోసగాళ్లు కొత్త మార్గంలో బ్యాంక్ కస్టమర్లను మోసం చేస్తున్నారు.
బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని కాల్ చేస్తుంటారు. దీంతో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. 'బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని.. అందుకే బ్యాంక్ వివరాలు, ఓటీపీ చెప్పమంటూ అడుగుతున్నారు.
అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేస్తామని మోసగాళ్లు కాల్ చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా వుండాలని బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేసుకోవాలని భావిస్తే.. బ్యాంక్‌కు వెళ్లండి. లేదంటే ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి పని పూర్తి చేసుకోండి. మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దంటూ బ్యాంక్ అధికారులు చెప్తున్నారు.