సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (13:20 IST)

అంత్యక్రియలకు డబ్బుల్లేక తల్లి మృతదేహాన్ని ఫుట్‌పాత్ పైన పడేసి వెళ్లిపోయిన కొడుకు

హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్డు సమీపంలో ఫుట్‌పాత్ పైన ఆదివారం గోనెసంచిలో ఓ మృతదేహం పడి ఉందని కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పరుచుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
 
మృతదేహానికి సంబంధించిన వివరాలను ఆరా తీసారు. పోలీసుల వివరాల మేరకు మృతురాలు నిజామాబాద్ జిల్లా, వార్ని మండలానికి చెందిన భాగిరథీ(75) వృద్ధురాలుగా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు సమాచారం. భాగిరథీ తన పెద్దకుమారుడితో నిజామాబాద్ జిల్లాలో ఉంటున్నట్లు, తన పెద్ద కుమారుడు రోజువారీ వేతనంతో కూలీ చేస్తూ జీవనాన్ని గడుపుతున్నారు.
 
తన చిన్న కుమారుడు హైదరాబాదులో వాచ్‌మెన్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. భాగీరథీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కరోనాతో మరణంచారు. లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పెద్ద కుమారుడు రమేశ్ తన తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని వెళ్లడానికి వీలుపడక, మరో ప్రక్క అంత్యక్రియలకు డబ్బుల్లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇక వేరే మార్గం లేక తన తల్లి మృతదేహాన్ని గోని సంచిలో పెట్టి బంజారాహిల్స్ 2వ నెంబరు రోడ్డు సమీపంలో వున్న ఫుట్‌పాత్ పైన పడేశాడు.