గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:04 IST)

అకౌంట్లో డబ్బుల్లేవా.. అయితేనేం.. రూ.5 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు..?

ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా యోజన పేరిట ఓ కొత్త పథకాన్ని పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వంలో జన్‌ ధన్‌ యోజన స్కీం అత్యంత పేరుగాంచింది. చాలా మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీం కింద పేదలు తమకు సమీపంలో ఉండే ఏదైనా ఒక బ్యాంకుకు వెళ్లి సున్నా బ్యాలెన్స్‌తో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ప్రభుత్వ పథకాలకు చెందిన నగదు జన్‌ ధన్‌ అకౌంట్లలోకి బదిలీ అవుతుంది.
 
ప్రధాని మోదీ జన్‌ ధన్‌ యోజన స్కీమ్‌ను 2014 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. ఈ స్కీం కింద అకౌంట్‌ ఓపెన్‌ చేసే వారికి ఇన్సూరెన్స్‌ కూడా లభిస్తుంది. అయితే జన్‌ ధన్‌ అకౌంట్లు కలిగి ఉన్నవారు ఆయా అకౌంట్లలో డబ్బులు లేకపోయినప్పటికీ రూ.5వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల పేదలకు అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలు తీరుతాయి.
 
బ్యాంకులు సాధారణంగా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని కార్పొరేట్‌ లేదా శాలరీ అకౌంట్లు కలిగిన కస్టమర్లకు అందిస్తుంటాయి. అకౌంట్లలో డబ్బులు లేకపోతే వారి క్రెడిట్‌ హిస్టరీ, ప్రొఫైల్‌ను బట్టి బ్యాంకులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం అందిస్తాయి. ఓవర్‌ డ్రాఫ్ట్‌ మొత్తంలో నుంచి వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీని వసూలు చేస్తాయి. అయితే జన్‌ ధన్‌ ఖాతాదారులకు వడ్డీ ఉండదు. కానీ వారు రూ.5వేల వరకు డబ్బు అలా ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద విత్‌ డ్రా చేసుకుని వాడుకోవచ్చు. ఇక ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కింద వాడుకున్న మొత్తాన్ని బ్యాంకులు సూచించిన తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.
 
జన్‌ ధన్‌ ఖాతాదారులు రూ.5వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకోవాలంటే తమ అకౌంట్‌ను ఆధార్‌కు లింక్‌ చేయడంతోపాటు వారు అకౌంట్‌ను తరచూ వాడుతుండాలి. అలాగే దానికి ఇచ్చే రుపే కార్డును కూడా వాడుతూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్న జన్‌ధన్‌ ఖాతాదారులకే ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని అందిస్తారు. ఇక జన్‌ ధన్‌ ఖాతాకు ఇచ్చే రుపే డెబిట్‌ కార్డుకు రూ.1 లక్ష ఉచిత ఇన్సూరెన్స్‌ లభిస్తుంది.