మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (20:22 IST)

బీఆర్ఎస్‌కు త్వరలోనే వీఆర్ఎస్ : జేపీ నడ్డా జోస్యం

jpnaddah
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ (వీఆర్ఎస్) వస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ వేదికగా గురువారం భారీ బహిరంగ సభను నిర్వహించారు.  
 
ఇందులో జేపీ నడ్డా ప్రసంగిస్తూ, తెలంగాణాకు సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చివేశారని ఆరోపించారు. అందినంత దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారం, కేసీఆర్‌కు విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. పైగా, సీఎం కేసీఆర్‌ను గద్దెదించగల శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 
 
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ కానుందని ఎద్దేవా చేశారు. ఒక దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని నడ్డా ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు కుటుంబ పాలన తప్ప ప్రజా సంక్షేమం గురించిన ఆలోచన ఉండదని అన్నారు. బీజేపీ మాత్రమే కీసీఆర్‌ను గద్దె దించగలదని నడ్డా జోస్యం చెప్పారు.