బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా: కేసీఆర్ మరో అంబేద్కర్‌గా మిగిలిపోతారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఊరు, ప్రతి వాడలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు.
సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశాను అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఈ దేశంలో దళితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. దళితులను గౌరవించాల్సిన అవసరం ఉంది. దళిత బంధు గురించి సీఎం కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారు.
దళిత బంధు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే ధైర్యం చేయలేదు. రైతుబంధు మాదిరిగా దళిత బంధును దళితుల ఖాతాల్లో వేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న మొనగాడు కేసీఆర్ మాత్రమే అని నర్సింహులు పేర్కొన్నారు.