ఉధృతంగా గోదావరి : ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక
తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు ఎగువున కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఈ కారణంగా రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భక్తులు నదిలో స్నానాలను నిషేధించారు. పుష్కరఘాట్ వద్దే ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అలాగే, తెలంగాణ, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నారం బరాజ్‌కు 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు 56 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటిమట్టం 4.28 టీఎంసీలుగా కొనసాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9,26,849 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 8,71,395 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 7.259 టీఎంసీలుగా ఉన్నది.