శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (22:59 IST)

కరోనాతో యజమాని మృతి .. పలకరింపుకు ఎవరూ రాలేదనీ ఫ్యామిలీ సూసైడ్...

కరోనా వైరస్ అనే మహమ్మారి అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ వైరస్ సోకి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ అనుకున్నవారు దూరమైపోయారన్న బాధను జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా వైరస్ సోకి కుటుంబ యజమాని చనిపోయారు. ఆ కుటుంబాన్ని పలుకరించేందుకు ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మృతుని భార్య, ఇద్దరు పిల్లలు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదల గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ఈ నెల 16వ తేదీన మృతి చెందారు. 
 
ఈ విషయం తెలిసినప్పటికీ బంధువులు కానీ, స్నేహితులు కానీ మిగిలిన కుటుంబ సభ్యులను పలకరించేందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గత అర్థరాత్రి రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ముగ్గురి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.