శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:20 IST)

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం : సీబీఐ విచారణ కోరిన పిటినరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 'ఫోన్ ట్యాపింగ్‌' వ్యవహారం కలకలం రేపుతోంది. ఏపీ‌ హైకోర్టులోని కొందరు జడ్జీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
 
ఇందుకోసం సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది.
 
అలాగే, ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
 
ఇదిలావుంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. 'అవాస్తవాలను ప్రచారం చెయ్యడంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత గోబెల్స్‌ని మించిపోయారు. గతంలో చంద్రబాబు సర్కార్ ఇజ్రాయెల్ టెక్నాలజితో ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిన్నట్టు ఆధారాలతో పాటు నిరూపించాం అంటున్నారు. మరి ఆ ఆధారాలు ఎక్కడ? మీ పత్రికలో ఎందుకు ప్రచురించలేదు?' అని ప్రశ్నించారు.  
 
'ఎన్నికల తర్వాత ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి వేసిన కేసు కూడా వెనక్కి తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని బుద్ధా వెంకన్న అన్నారు.  
 
'ఎన్నికలకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారాలు చూపించలేక చేతులెత్తేసి కేసు విత్‌డ్రా చేసుకున్నారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే హోంమంత్రి ఏడాదిన్నరలో ఏం చర్యలు తీసుకున్నట్టు? కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం కేసులు వేశారు' అని బుద్ధా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు.