జనసేన గాలివాటం పార్టీ .. నావి వైకాపా జీన్స్ : ఎమ్మెల్యే రాపాక
జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ గాలివాటం పార్టీ అని సెటైర్లు వేశారు. పైగా, తాను ఒరిజినల్‌గా వైకాపా వాడినేనని అన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించానని, బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరారని చెప్పుకొచ్చారు. కేవలం పోటీలో ఉండాలనే జనసేనలో చేరానని చెప్పారు. ప్రస్తుతం వైసీపీతోనే తన పయనమని రాపాక స్పష్టంచేశారు.
రాజోలు నియోజకవర్గంలోని మూడు వైసీపీ గ్రూపుల్లో తనది కూడా ఒకటన్నారు. పోటీ ఉండాలనే కారణంతోనే తాను జనసేనలోకి వెళ్లానని అన్నారు. జనసేన గాలికి వచ్చిన పార్టీ అని... భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికే ఉండదని జోస్యం చెప్పారు.
అది కేవలం ఒక వర్గానికి చెందిన పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ఇదేసమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు రాపాక ఒక సూచన చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి మంచిది కాదని.. గ్రూపులను అంతం చేయడానికి జగన్ ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. వీలైనంత త్వరగా వీటికి ముగింపు పలకాలని అన్నారు.
కాగా, జనసేన తరపున గెలిచినప్పటికీ రాపాక ఏనాడూ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించని సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన జగన్‌ను పొగుడుతూనే ఉన్నారు. పార్టీ హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా వైసీపీకి మద్దతు పలికారు. దీంతో, రాపాకను పవన్ పట్టించుకోవడం మానేశారు. ఈ పరిస్థితుల్లో ఆనయ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.