నేను నెగ్గిన జనసేన పార్టీ వుంటుందో లేదో? మళ్లీ రాపాక రచ్చరచ్చ వ్యాఖ్యలు
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. సహజంగానే పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినపుడు ఆయనకు పార్టీలో వుండే వెయిటేజి చాలా ఎక్కువ. కానీ రాపాక మాత్రం తను నెగ్గిన పార్టీ మాత్రం వట్టి డొల్ల అంటున్నారు. అసలు వుంటుందో వుండదో కూడా డౌటేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తను 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైన దశలో అనూహ్యంగా తనకు టిక్కెట్ దక్కలేదన్నారు. దానితో తను ఇంట్లో గమ్మున కూర్చుండిపోతే, జనసేన నుంచి కొంతమంది నాయకులు తన ఇంటికి వచ్చి టిక్కెట్ ఇస్తాం, పోటీ చేయమని బ్రతిమాలాడారన్నారు. అలా ఎన్నికల బరిలో దిగితే పార్టీ అంటే ఇష్టం లేకపోయినా వ్యక్తిపై వున్న ఇష్టంతో తనను ప్రజలు గెలిపించారన్నారు.
జనసేన నుంచి గెలిచిన తర్వాత తను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాననీ, ఆ సందర్భంలో తనకు టిక్కెట్ ఇవ్వలేకపోవడంపై జగన్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఐతే కలిసి ముందుకు సాగుదామని చెప్పారన్నారు. ఆయన ఆ మాట చెప్పిన రోజు నుంచి నేను వైకాపాను అనుసరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తున్నానని అన్నారు. మరి రాపాక వ్యాఖ్యలపై జనసేన అధినాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.