1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (08:42 IST)

భాగ్యనగరిపై ముసురు : వీడని వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ముసురు కొన‌సాగుతూనే ఉంది. గ‌త మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌గా మ‌రికొన్ని ప్రాంతాల్లో ఏక‌ధాటిగా వ‌ర్ష‌పు జ‌ల్లులు ప‌డుతూనేవున్నాయి. 
 
గ‌డిచిన 24 గంట‌ల్లో చార్మినార్‌లో అత్య‌ధికంగా 26.5 మిల్లిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 22వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 73 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం కురిసింది. ఈ స‌మ‌యంలో న‌గ‌రంలో 388.9 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంది. 
 
వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు న‌మోద‌య్యే అవకాశం ఉందని హెచ్చరించింది.