గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి.. కోలుకుని బిల్లు చెల్లించలేక ఆత్మహత్య

hang
తెలంగాణా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు పూర్తిగా కోలుకున్నారు. కానీ, ఆస్పత్రి బిల్లు చెల్లించలేక అదే ఆస్పత్రిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెల్పూరులో కేటీపీసీ నిర్మాణంలో భాగంగా భూపాలపల్లి మండలం మహబూబ్‌పల్లికి చెందిన మర్రి బాబు (46) అనే వ్యక్తి గత 2006లో తనకున్న రెండు ఎకరాల భూమిని కోల్పోయాడు. బాబు నుంచి భూమిని తీసుకున్నపుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు. కానీ, యేళ్లు గడుస్తున్నా ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన పలుమార్లు జెన్‌కో అధికారులను కలిసి మొరపెట్టుకున్నప్పటికీ వారు స్పందించలేదు. 
 
దీంతో ఈ నెల 1వ తేదీన కేటీపీసీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం రూ.60 వేల బిల్లు వేసింది. బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. 
 
డబ్బుల కోసం వెళ్లినవారు మూడు రోజులైనా రాకపోవడంతో మనస్తాపం చెందిన బాబు గురువారం ఉదయం ఆస్పత్రి వార్డులోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మనిషి ప్రాణంపోయినప్పటికీ గతంలో ఇచ్చిన హామీ మేరకు మృతుని కుటుంబానికి జెన్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.