బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (17:57 IST)

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె వరుసగా 43వ రోజు కొనసాగుతోంది. బస్సురోకో నిర్వహించాలన్న ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు వేకువజాము నుంచే కార్మికులు డిపోల ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్మికుల చర్యలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆందోళన కారులను అరెస్టు చేస్తున్నారు.
 
సమ్మెలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట డిపో ఎదుట ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఐకాస, వామ పక్ష ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు రెండు బృందాలుగా ఏర్పడి ఆందోళన చేపట్టారు.

మొదట డిపో ఎదుట ధర్నా చేసి బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ ఐకాస బాధ్యులు రవి, రాజయ్య, బి.రవి, తదితరులను పోలీసులు అరెస్టు చేయగా.. సీపీఎం, సీపీఐ, టీపీఎఎఫ్‌, ఎంఆర్పీఎస్‌ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బస్టాండ్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. 
 
హైదరాబాద్‌ పాతబస్తీ ఫారూఖ్‌నగర్‌ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 15 మందికార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్‌నుమా బస్సుడిపో ఎదుట ఆందోళన చేస్తున్న 40 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు సిద్దిపేటలోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. డిపో ఎదుట బైఠాయించిన కార్మికులు.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేకువజామునే డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు కార్మికులు, అఖిల పక్ష నాయకులు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
వి.హెచ్ ఆవేదన
ఆర్.టి.సి జాక్ కో-కన్వీనర్ రాజీ రెడ్డి, మరియు మహిళ ఉద్యోగులను రాజీ రెడ్డి ఇంటి వద్ద అప్రజాస్వామిక పోలీసులు అరెస్ట్ చేసి పహాది షరీఫ్ పోలీస్ స్టషన్ తరలించగా. ఈ సందర్భంగా 2 మహిళ ఉద్యోగులకు స్వల్ప గాయాలు కావడం జరిగింది.
 
 విషయం తెలుసుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎం.పి వి.హనుమంత రావు పహాది షరీఫ్ పి.ఎస్ చేరుకొని వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడుతూ.. పోలీసులు రాజీ రెడ్డి ఇలా అప్రజాస్వామిక ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం పట్ల ముఖ్యంగా మహిళ పోలీసులు లేని సమయంలో ఆర్.టి.సి మహిళ కార్మికుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వి.హెచ్ తప్పుపట్టారు. 
 
పోలీసులు ఆర్.టి.సి నాయకుల పట్ల టెర్రరిస్టులతో వ్యవహరించినట్లు వ్యవహరిస్తున్నారని వి.హెచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.