అత్యాచారం చేసి ఆపై మాత్రలు ఇచ్చి.. మైనర్‌పై యువకుల దారుణం!
తెలంగాణా రాష్ట్రంలో మరో చిన్నారి కామాంధుల చేతిలో బలైంది. యువతులు, మహిళలను రక్షించేందుకు ఎన్నో రకాలై కఠిన చట్టాలు చేస్తున్నప్పటికీ వాటివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో నేరాలు ఘోరాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి గర్భందాల్చడంతో గర్భస్రావం చేసేందుకు మాత్రలు మింగించారు. కానీ, అవి వికటించి ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా గ్రామీణ జిల్లాకు చెందిన దుగ్గోండి మండలం, రేపల్లెకు చెందిన ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు లొంగదీసుకుని అత్యాచారం జరిపారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు గర్భస్రావం అయ్యేందుకు ఆ బాలికకు మాత్రలు ఇచ్చారు.
ఈ మాత్రలను మింగిన తర్వాత ఆ బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ, ఆ యువతి చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.