బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (15:02 IST)

అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించాలని ప్రయత్నం చేశాయని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆదివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
భాజపాను అడ్డుకోవడానికి సీఎం రూ.వందల కోట్లు కుమ్మరించారని ఆరోపించారు. కేసీఆర్‌కు భాజపా మరో అల్టిమేటం ఇవ్వబోతోందని తెలిపారు. తెరాస ప్రభుత్వానికి, కేసీఆర్‌కు భాజపా సత్తా ఎంటో చూపిస్తామని స్పష్టం చేశారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులకు భాజపా తరపున శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఈ గెలుపుతో పీవీ గెలిచినట్లా? లేక కేసీఆర్‌ గెలిచినట్లో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
తెరాస గెలుపు తాత్కాలికమేనని, తమ లక్ష్యం 2023 అని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భాజపా అండగా ఉంటుందన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భాజపా గెలుస్తుందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.
 
కాగా, రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు వాణీదేవీ, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు గెలుపొందగా, వీరికి తెలంగాణ రాష్ట్ర సీఎం, తెరాస అధినేత కేసీఆరు శుభాకాంక్షలు తెలిపారు.