తెలంగాణలో మూడు రోజులకు వర్ష సూచన.. తేలికపాటి జల్లులు
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో వరుణ భగవానుడు కాస్త కరుణించినట్లు తెలుస్తోంది. ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
శుక్రవారం విదర్భ పరిసర ప్రాంతాలకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువొచ్చని చెప్పింది.
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో ఒక మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లూరులో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.