ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (11:16 IST)

హైదరాబాద్ పాఠశాలలపై కరోనా పడగ...

హైదరాబాద్ నగరంలోని పలు పాఠశాలలపై కరోనా పడగ విసిరింది. నగరంలోని పాఠశాలలు, వసతి గృహాల్లో కరోనా ప్రబలుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 
 
గురువారం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని రెండు పాఠశాలలు, రెండు రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతి గృహంలోని 335 మందికి నిర్వహించిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 28 మంది విద్యార్థులు, హాస్టల్‌ వార్డెన్‌, వాచ్‌మెన్‌, ఉపాధ్యాయుడు ఉన్నారు.
 
రాజేంద్రనగర్‌లోని ఎస్టీ బాలుర వసతి గృహంలోని పలువురు విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. 105లో 22 మంది విద్యార్థులు, వార్డెన్‌, వాచ్‌మెన్‌ సహా 24 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతుండటంతో అక్కడా పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది.
 
శంషాబాద్‌ చిన్న గోల్కొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 48 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. సరూర్‌ నగర్‌లోని (ముషీరాబాద్‌) జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలోని 30 మందిౖకి వైద్య పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.
 
అబ్దుల్లాపూర్‌మెట్‌ బాటసింగారం జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో వంద మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ తేలింది. బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో 38 మందికి కొవిడ్‌ సోకిన విషయం తెలిసిందే. నిర్ధారణకు వీరికి మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చే యగా వైరస్‌ ఉన్నట్లు తేలింది.
 
అలాగే, కొవిడ్‌ మహమ్మారి మరోసారి జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై ప్రభావం చూపింది. సర్కిల్‌-16 పరిధిలో పలువురికి పాజిటివ్‌ రావడంతో అక్కడ ప్రవేశాలపై నిషేధాలు అమలు చేస్తున్నారు. తాజాగా పాజిటివ్‌గా తేలిన వారిలో సర్కిల్‌ పరిధిలోని ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు.
 
అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మహిళా వసతి గృహాంలో 200 మందికి గురువారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో కోఠి మహిళా కళాశాలకు చెందిన ఓ విద్యార్థినికి, వసతి గృహం అధికారిణికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో విద్యార్థినిని ఇంటికి పంపించారు. రెండు రోజుల క్రితం పరిశోధన వసతి గృహంలో ఇద్దరికి వైరస్‌ సోకింది.